Wednesday, 17 August 2011

Stalin Swati's victory secrets very Inspiring








 చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో ఎవరైనా పరీక్ష రాసేందుకు సాయపడమంటూ అర్థిస్తుంటుంది ఓ అంధురాలు. ఆ సన్నివేశం ప్రేక్షకులకు ఎన్ని కన్నీళ్లు తెప్పించిందో.. ఆ పాత్ర ధారిణి స్వాతి. నిజ జీవితం వింటే కూడా అంతే బాధ కలుగుతుంది. ఆ బాధ వెనక ఉన్న ఆమె పట్టుదల మాత్రం చాలా మందికి స్ఫూర్తి నివ్వగల విషయం. ఎంత పట్టుదల లేకపోతే ఆమె ఐ.ఎ.ఎస్. సాధిస్తుంది..? ఒక్కో మెట్టు ఎక్కుతూ... ఇక్కడిదాక వచ్చిన స్వాతి విజయరహస్యం ఏమిటని అడిగితే... ఇలా చెప్పుకొచ్చారు..


"స్వాతి, ఎంఏ, బీఈడీ. ఒకప్పుడు నా లక్ష్యం అంతే. నా పేరు పక్కన ఆ క్వాలిఫికేషన్లను పెట్టుకుంటే ఈ జీవితానికి చాలు అనుకున్నాను. మా తాత రామయ్య లక్ష్యం కూడా అదే. అంధత్వంతో బాధపడుతూ ఉన్నత చదువులు చదవడం అంత సులువు కాదు.





అయినా పెరిగే కొద్దీ నా పట్టుదల రెట్టింపు అవుతూ వచ్చింది. హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలల్లో ఇంటర్ వరకు కష్టపడి చదివి పాసయ్యాను. ఆ తర్వాత డిగ్రీలో చేరాను. ఫస్ట్ ఇయర్‌లో ఉండగానే పంచాయతీరాజ్‌లో ఉద్యోగం రావడంతో కర్నూలు వెళ్లిపోయాను. కొన్నాళ్లకు- కర్నూలు పెద్దాస్పత్రిలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌గా చేరిపోయాను. అక్కడున్నప్పుడే ఉన్నత చదువుల మీద దృష్టి పడింది.





దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ, బీఈడీ చదివాను. మా తాతయ్య కోరిక నెరవేరింది కదాని ఊరుకోలేదు నేను. సివిల్ సర్వీసు సాధిస్తే ఎంతోమందికి సేవ చేయవచ్చు అనుకున్నాను. ఆలోచన వచ్చిందే తడవు పనికి పూనుకున్నాను. నాలో కసిని పెంచడానికి ఎన్నో కారణాలున్నాయి. నేను చిన్నప్పుడు కాటరాక్ట్ సమస్యతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆ డాక్టర్ అప్పటికే తాగి ఉన్నాడు. అతని నిర్లక్ష్యపు ఆపరేషన్ వల్ల నాకు చూపు పూర్తిగా పోయింది.





అయినా సరే అది నా దురదృష్టం అనుకుంటూ ఊరుకోలేదు. నాలో పుష్కలంగా ఉన్న సానుకూల దృక్పథమే నన్ను కొత్త జీవితం వైపు వేలు పట్టుకు నడిపించింది.







స్నేహితులే నా కళ్లు..


అంతా ఆరోగ్యంగా ఉన్న వాళ్లకే సివిల్స్ సాధించడం చాలా కష్టం. మరి నేను, అంధురాలిని. అన్ని సబ్జెక్టులు ఎలా చదవాలి..? మెటీరియల్‌ను ఎలా సంపాదించాలి..? ఇలాంటి ప్రశ్నలెన్నో.





ఆ సందర్భంలోనే అప్పటికే ఐఏఎస్ సాధించిన భరత్ అండదండలు అందించారు. నేను టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో పనిచేసేటప్పుడు ఆయన పరిచయం. సివిల్స్ దరఖాస్తును కూడా స్వయంగా భరత్ తీసుకొచ్చిచ్చారు. మెటీరియల్ సంపాదించడంలో హైదరాబాద్‌లోని 'వివేకానంద సేవిక'కు చెందిన జ్ఞానేశ్వర్ రావు, సినీ హీరో రాంచరణ్ తేజతోపాటు 'నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్' సంస్థ నాకు సహాయపడ్డాయి. అయితే, ఈ మెటీరియల్‌ను ఉన్నది ఉన్నట్లుగా చదువుకోవడానికి వీలుండదు. అందుకే పుస్తకాలకు పుస్తకాలే ఆడియోలుగా మార్చి ఇచ్చారు స్నేహితులు.





వాళ్లు ఎంతో ఓపికతో ఈ పనులు చేయడం నా మీద నాకున్న బాధ్యతను మరింత పెంచింది. ఆడియో రూపంలో ఉన్న పుస్తకాలను... టైము దొరికినప్పుడల్లా సెల్‌ఫోన్ మెమొరీ కార్డులోకి ఎక్కించేదాన్ని. ఎందుకంటే, సెల్‌ఫోన్ ఎప్పుడూ నా వెంటే ఉంటుంది కదా..! ఆడియో పాఠాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా వినవచ్చు. ఆఫీసులో సమయం దొరికినప్పుడల్లా సెల్‌ఫోన్‌కు ఇయర్‌ఫోన్స్ అమర్చుకుని పాఠాలను వినేదాన్ని.





అవసరం లేని పాఠాలను సెల్‌ఫోన్ నుంచి డిలీట్ చేయడం, వినాల్సిన వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం.. ఇదే నా పని. సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికొస్తూనే అరగంటలో రీఫ్రెష్ అయ్యేదాన్ని. అప్పటి నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఏకధాటిగా పాఠాలు వింటూ.. ప్రిపరేషన్ కొనసాగించాను. మధ్యలో ఏ సందేహం కలిగినా భరత్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకునేదాన్ని. ఆయన ఎంతో సానుకూలంగా ప్రోత్సహించడం మరిచిపోలేను.





అడ్డంకులను అధిగమిస్తూ..


నేను సివిల్స్‌కు ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్పాను కదా. దానికి ముందు మరొక విషయం చెప్పాలి. అంధులకు పదోతరగతి వరకే బ్రెయిలీ లిపి బుక్స్ ఉంటాయి.





ఆ తర్వాత ఉండవు. మేమే సొంతంగా మెటీరియల్ సేకరించి, ఆడియో తయారు చేసుకుని.. ప్రిపేరవ్సాల్సి ఉంటుంది. పరీక్షల కోసం సహాయకుల మీద ఆధారపడాలి. 







పదో తరగతి పరీక్షలు రాసే సమయంలో నాకు ఒక సహాయకున్ని కేటాయించింది ప్రభుత్వం. సమస్య ఎక్కడొస్తున్నదంటే.. పరీక్షలు రాసే అంధుల సామర్థ్యంకంటే తక్కువ తెలివితేటలున్న వారిని సహాయకులుగా నియమిస్తున్నారు. దీని వల్ల మేము వ్యక్తీకరించే భావాలన్నీ జవాబుపత్రాల్లో స్పష్టంగా ప్రతిఫలించడం లేదు.





దాని వల్ల అంధులు చాలా నష్టపోతున్నారు. నేను కూడా అలాగే నష్టపోవడంతో మార్కులు తగ్గిపోయాయి. సివిల్ సర్వీసు పరీక్షల్లో కూడా ఇవే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి అంధులు బయట పడాలంటే- కంప్యూటర్ ద్వారా ఎవరికి వారు పరీక్షలు రాయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలి. అలాంటి రోజు వస్తే.. గ్రూప్-1, సివిల్ సర్వీసుల్లో అంధుల విజయాల సంఖ్య పెరుగుతుంది.





సివిల్స్ వైపు..


సివిల్స్‌లో ప్రిలిమ్స్ కోసం జాగ్రఫీ ఆప్షనల్‌గా తీసుకున్నాను. సీనియర్లయిన భరత్, గంధం చంద్రుడు (సివిల్స్ విజేతలు) సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. నెల్లూరుకు చెందిన అంధ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఐఏఎస్‌కు ఎంపికయ్యారని తెలిసింది. ఆయన ఫోన్ నెంబర్ కోసం ఎంత ప్రయత్నించినా అప్పట్లో నాకు దొరకలేదు.





నాకు ఐఏఎస్ వచ్చాక ఆయనే ఫోన్ చేసి నన్ను అభినందించడం చాలా సంతోషాన్నిచ్చింది. ప్రిలిమ్స్ తేదీలు ఖరారయ్యాయి కానీ, హాల్‌టికెట్ మాత్రం రాలేదు. కంగారు పడ్డాను. ఆఖరికి అధికారులకు ఫోన్ చేసి ఇంటర్‌నెట్‌లో హాల్‌టికెట్ తీసుకున్నాను. ఆ సమయంలో మా అమ్మానాన్న (రంగస్వామి, అనురాధ) నాకెంతో మనోధైర్యాన్ని నూరిపోశారు. ఇంతలో మెయిన్స్ పరీక్షలు రానే వచ్చాయి. అడిగిన ప్రశ్నలకు చక్కగానే రాశాను. అనుకున్నట్లే గట్టెక్కాను. ఇక ఇంటర్వ్యూ ఒక్కటే ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమైంది. 





గది లోపలికి వెళ్లే ముందు ఒత్తిడికి గురయ్యాను. ఇంటర్వ్యూ పానల్‌లో అయిదుగురు సభ్యులున్నారు. వాళ్లు చాలా స్నేహపూరిత వాతావరణంలో ప్రశ్నలు అడగడంతో ఒత్తిడి మాయమైంది. నలభై నిమిషాలపాటు సాగిన ఇంటర్వ్యూ సంతృప్తికరంగానే ముగిసింది. ఆ ఇంటర్వ్యూలో ఎంతో కొంత ఆత్మవిశ్వాసం కనబరిచానంటే అది నా స్కూల్‌డేస్ మహిమ అనే చెప్పుకోవాలి.





ఎందుకంటే- నేను ఇంటర్‌లోనే కరాటే, కూచిపూడిలలో ప్రావీణ్యం పొందాను. నా ప్రతిభను చూసి ముచ్చటపడిన కొందరు చిరంజీవి నటించిన 'స్టాలిన్' సినిమాలో అవకాశం ఇచ్చారు. నా బోటి దానికి సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయం. 'ప్రేమించు' సినిమాలో కూడా నటించాను. ఎన్ని చేసినా సివిల్స్ నా లక్ష్యం. ఫలితాలు వెలువడ్డాయి. నాకు ఐఏఎస్ వచ్చింది. చాలానే సాధించాను కాని ఈ జీవితానికి ఇంతకంటే గొప్ప విజయం ఏముంటుందని ఇప్పుడు అనుకోవడం లేదు నేను. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.





నేను ఈ విజయం సాధించిన తర్వాత- పాములపాడుకు చెందిన ఉపాధ్యాయుడు చంద్రకంటి మద్దయ్య నా మీద పాటరాసి సంగీతం సమకూర్చాడు. కర్నూలు కలెక్టరేట్‌లో జరిగిన అభినందన సభలో ఆ పాట పాడుతుంటే మా కుటుంబమంతా కన్నీళ్లు పెట్టుకుంది..'' అంటూ ముగించారు స్వాతి. - పిడుగు సుబ్బరాయుడు, ఆన్‌లైన్, కర్నూలు




No comments:

Post a Comment

You May Like...

Related Posts Plugin for WordPress, Blogger...

Comments